Home » » పాములు పాలు తాగుతాయా.....?

పాములు పాలు తాగుతాయా.....?

పాములు పాలు తాగుతాయా.....? 
అంటే... ఒక సైన్స్ స్టూడెంట్ గా వాటి శారీరక నిర్మాణం, జీర్ణవ్యవస్థ పాలు తాగేందుకు అనువుగా ఉండదు కనుక తాగవు అనీ, ఒకవేళ అలా ఆహారం దొరకక ఆకలితో ఉన్న ఏ పామైనా పాలు తాగి కడుపు నింపుకున్నా మోతాదు మించితే అవి వాటి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఉక్కిరిబిక్కిరి అయ్యి మరణిస్తాయనీ చెప్పాలి, పాములు కప్పల్నీ, ఎలుకల్నీ, చిన్నపాటి కీటకాల్నీ మింగేసి తమ శరీరంలో స్రవించే శక్తివంతమైన రసాయనాల ప్రభావంతో వాటిని జీర్ణం చేసుకుని ఆహారంగా తీసుకుంటాయి. నిజంగా పాముకి ఆహారాన్ని ఇవ్వాలంటే మనం అవి తినేవాటిని ఇవ్వాలి కానీ పాలను కాదు.

పాములు తమంతట తాముగా పుట్టలు నిర్మించుకోవు, చీమలు ఏర్పరిచిన పుట్టల్ని ఆక్రమించుకుని వాటిలో తలదాచుకుంటాయ్. ఒకోసారి చీమల దాడికి గురై గాయాలపాలౌతాయ్ కూడా, అందుకే వాటి శరీరం పై గాయాలకు పాల మీగడ, వెన్న లాంటివి రాస్తే వాటి గాయాలనుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది కాబట్టి పుట్టల్లో పాలను పో్స్తుంటారు. ఇక దీపావళి జరిగిన కొద్ది రోజులకే్ నాగుల చవితి పేరుతో పుట్టలో పాలు ఎందుకు పోస్తారంటే.... దీపావళి రోజు బాణాసంచా ప్రభావం వల్ల చాలా పాములు తమ నివాసాలు వదిలి దూరంగా వేగంగా పోతూ గాయాలకు గురౌతాయ్, కొన్ని కనిపించిన పుట్టలలో చేరతాయి. ఆ పుట్టల్లో ఉన్న చీమలు ఈ పాముల మీద దాడి చేస్తే 'బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ' అన్నట్లు ఎంత పెద్ద పామైనా చీమల ధాటికి గాయాల పాలవుతుంది. అలాంటి పాములకు కాస్త ఉపశమనం కలిగించడానికే పాలు పోస్తారు. ఇది ఆచారం వెనుక, నాగులచవితి వెనుక ఉన్న అసలు రహస్యం.
ఇప్పుడు మనమంతా పోటీలు పడి పుట్టల్లో పోసేవి కెమికల్స్ తో తయారైన పాకెట్ పాలు అంతమంది అన్ని పాకెట్ల పాలు వాటి మీద పోసేస్తే అవి అనారోగ్యానికి గురై చచ్చిపోతాయ్. నిజానికి పాముల పుట్టలో మీరు పోసే పాలను తాగేవి పాములు కాదు చీమలు.
ఇంకా చెప్పాలంటే మీరు పుట్టలో వేసే చలివిడి, పానకం , తేగలు, బుర్రగుంజు, బెల్లపు చిమ్మిలి వంటివి పాములు తినవు, వాటిని తినడానికి చీ్మలు ఆ పుట్టల్లో చేరతాయ్. అలా చేరిన చీమలు ఆ పుట్టలో పాము ఉంటే దాని మీద దాడి చేస్తాయ్. అప్పుడు పాము ప్రాణానికే ప్రమాదం. అందుకే అలాంటివి పుట్టలో కాకుండా పుట్ట బయట పెట్టి పూజించడం మంచిది. పుట్టల వద్ద భారీ సంఖ్యలో దీపాలూ, అగరువత్తులూ, బాణాసంచాలూ వెలిగిస్తే పాములు తట్టుకోలేవనే విషయాన్ని గమనించాలి. తెలియక మీరు చేసే చిన్నపాటి పొరపాట్ల వల్ల మీరు పూజిద్దామనుకున్న పాముల ప్రాణాలకే ప్రమాదం తీసుకొస్తున్నారని గుర్తుంచుకొని కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాములకు మేలు చేసినవారవుతారు.
-VenugopalaRaju