Home » » నేతాజీ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోలేద‌ట‌

నేతాజీ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోలేద‌ట‌

నేతాజీ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోలేద‌ట‌
-----------------------------------

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణంపై మిస్ట‌రీ ఇప్ప‌టికీ వీడ‌నే లేదు. ఆయ‌న ఎప్పుడు, ఎలా మ‌ర‌ణించార‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. ఈ మిస్ట‌రీని ఛేదించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం మూడు క‌మిష‌న్లు వేయ‌గా.. అందులో రెండు (1956, షాన‌వాజ్ క‌మిష‌న్‌, 1970, ఖోస్లా క‌మిష‌న్‌) ఆయ‌న విమాన ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించార‌ని తేల్చాయి. అయితే 1999లో ఏర్పాటైన ముఖ‌ర్జీ క‌మిష‌న్ మాత్రం నేతాజీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌లేద‌ని తేల్చింది. కానీ ప్ర‌భుత్వం ఈ క‌మిష‌న్ నివేదిక‌ను ప‌ట్టించుకోలేదు. తాజాగా ఓ ఫ్రెంచ్ హిస్టారియ‌న్ జేబీపీ మోరె ఈ మిస్ట‌రీకి మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. నేతాజీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌లేద‌ని ఆయ‌న కూడా స్ప‌ష్టంచేస్తున్నారు. 1947, డిసెంబ‌ర్ 11న అప్ప‌టి ఫ్రెంచ్ సీక్రెట్ స‌ర్వీస్ నివేదికే ఇందుకు సాక్ష్యం అని మోరె వాదిస్తున్నారు. నేష‌న‌ల్ అర్కైవ్స్ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి ఈ ప‌త్రాల‌ను సంపాదించిన మోరె.. 1945లో తైవాన్‌లో జ‌రిగిన విమానం ప్ర‌మాదంలో సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణించ‌లేద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.
1947 వ‌ర‌కూ ఆయ‌న బ‌తికే ఉన్న‌ట్లు ఈ ప‌త్రాల ద్వారా తెలుస్తున్న‌ద‌ని మోరె చెప్పారు. ఈ పత్రాల్లో ఎక్క‌డా చంద్ర‌బోస్ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ట్లు చెప్ప‌లేదు. 1947 డిసెంబ‌ర్ వ‌ర‌కు కూడా ఆయ‌న ఆచూకీ తెలియ‌లేద‌ని వీటిలో ఉంది. అంటే నేతాజీ ఆగ‌స్ట్ 18, 1945లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌న్న వార్త‌ల‌ను ఫ్రెంచ్ ఎప్పుడూ ధృవీకరించ‌లేదు అని మోరె వెల్ల‌డించారు. ఇండోచైనా నుంచి ఆయ‌న ప్రాణాల‌తో త‌ప్పించుకున్నారు. కానీ 1947, డిసెంబ‌ర్ 11 వ‌ర‌కు ఆయ‌న ఆచూకీ తెలియ‌లేదు. అంటే అప్ప‌టికీ ఆయ‌న బ‌తికే ఉన్న‌ట్లు దీనిద్వారా స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది అని మోరె చెప్పారు. ఇప్ప‌టికే బ్రిటిష్‌, జ‌ప‌నీస్ నేతాజీ విమాన ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించార‌ని ధృవీక‌రించిన విష‌యం తెలిసిందే. కానీ ఫ్రెంచ్ ప్ర‌భుత్వం మాత్రం ఆయ‌న మ‌ర‌ణంపై ఎప్పుడూ స్పందించ‌లేదు. అప్ప‌ట్లో వియ‌త్నాం ఫ్రెంచ్ కాల‌నీ ఆధీనంలోనే ఉండేది. దీనివ‌ల్ల ఈ ఫ్రెంచ్ నివేదిక‌కు, మోరె వాద‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.