Home » » నవయుగం

నవయుగం

బీప్ బీప్ అన్న శబ్దానికి ఒక్కసారి లేచేడు రాఘవ్. వెంటనే ఫోన్ తీసి చూసేసరికి, టైము ఐదూ పది. అప్పటికే హేమంత్ వాట్సాప్ లో తమ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేసి, ఫేస్ బుక్ లో మార్నింగ్ వాక్ కి వెళ్తున్నట్లు స్టేటస్ పెట్టేసేడు.
'ఈ ఇడియట్ గ్రూపు లో అందరికన్నా ముందే లేచేస్తానని వెధవ పోజు.. ' అనుకుంటూ బాత్రూమ్ లోకి దూరాడు.
ఫేస్బుక్ లో' feeling relieved ' అని స్టేటస్ పెడితే కిచెన్ లో కాఫీ పెడుతున్న భార్య వసుధతో సహా అందరూ లైక్ పెట్టారు.
' చూసేరా.. పక్కింటి జోషీ గారు మీ స్టేటస్ కి లైక్ పెట్టలేదు ' అని వసుధ వాట్సాప్ చేస్తే 'అవును.. He is feeling jealous' అని బాత్రూమ్ లోంచే రిప్లై కొట్టాడు రాఘవ.
బయటకొచ్చి వసుధ ఇచ్చిన కాఫీ తాగుతూ 'feeling excited.. Going to station to receive my attaiyya'అని స్టేటస్ పెట్టి కారు పక్కన నుంచున్నట్టు సెల్ఫీ పెట్టె పెట్టగానే ఓ యాభై లైకులూ,' so sweet ',' lovable family man' అంటూ రిప్లైలూ వచ్చేయి.
కారు స్టార్ట్ చేస్తుంటే, పక్కింటి జోషి గారు 'no water in toilet, feeling frustrated' అని స్టేటస్ పెడితే, కసిగా లైక్ పెట్టి స్టేషన్ కి బయల్దేరాడు రాఘవ. లక్డీకాపూల్ దగ్గిరకొచ్చేసరికి రోడ్డు పక్కన ఎవడో మోటర్ సైకిలు మీద స్పీడుగా వెళ్తూ సెల్ఫీ తీసుకోబోతూ రోడ్డు పక్కన దేవుడి బొమ్మ గీస్తున్న సాయిబుని గుద్దేసి, బండి స్కిడ్డైపోయి కిందడిపోతే, వెంటనే ఫొటో తీసి 'unsafe roads.. Feeling sad' అని ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టేడు. వెంటనే ఎవరో మోడీ వచ్చినా రోడ్డు సేఫ్టీ పెరగలేదు అని రిప్లై పెడితే, ఇంకొకడు 'రోడ్ సేఫ్టీ అనేది స్టేట్ సబ్జెక్టు.. అందుకని కెసిఆర్ ని బ్లేమ్ చెయ్యండి మోడిని కాదు' అనేసరికి మోడీ భక్తులంతా లైకులెట్టేసేరు.
సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళి గౌతమి ఎక్సప్రెస్సు లో పుల్లేటికుర్రు నుంచి హైదరాబాద్ ఎల్వీ ప్రసాదు ఆసుపత్రిలో కళ్లు చూపించుకోడానికొచ్చిన వాళ్ళ సత్తులత్తయ్యని ప్లాట్ఫారం మీదే నుంచోబెట్టేసి సెల్ఫీ తీసుకుని 'meeting sattulattayya after a long time.. Feeling loved' అని స్టేటస్ పెడితే ఓ నూటేభై మంది లైకులూ, కళ్ళమ్మట నీళ్ళెట్టేసుకున్నట్టు ఈమోజీలు పెట్టేసేరు. ఆ తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత భార్య వసుధ, ఎల్కేజీ చదువుతున్న కొడుకు ఆర్యన్ తోపాటు సత్తులత్తయ్యతో ఇంకో సెల్ఫీ తీసుకుని 'loving family with adorable సత్తులత్తయ్య at my own house in Lake top apartments' అని స్టేటస్ పెడితే ఫ్రెండ్సూ, చుట్టాలందరూ కూడా లైకులెట్టేసేరు.
'సత్తులు పిన్నీ.. మీరొచ్చేరని స్పెషల్ గా ఇవ్వాళ వీధి చివర కర్రీపాయింటు నుంచి ఇవ్వాళ ఎల్లో రైస్ తెప్పించమన్నారు మీ మేనల్లుడు ' అన్న వసుధ తో' ఎల్లో రైసేమిటమ్మా' అని సత్తులుగారడిగితే 'టెంపుల్ కెళ్తే పూజారంకుల్ పెడతారు కదా గ్రాండ్మా... అది కూడా తెలీదా' అని ఆర్యన్ అన్నాడు. 'తప్పు నాన్నా.. పులిహోర అనాలి.. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. దాన్నట్టుకుని ఎల్లోరైసూ, వైట్ రైసూ అనకూడదు' చెప్పింది సత్తులత్తయ్య
'వీడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు కద పిన్నీ.. వాళ్ళకి పులిహోర లాంటి కాంప్లికేటెడ్ వర్డ్స్ నేర్పించరు.. నువ్వు ఎల్లో రైసనే అను నాన్నా.. లేకపోతే ఈసారి గుడికెళ్ళినప్పుడు పులిహోర అంటే పూజారంకుల్ కన్ఫ్యూజ్ అవుతారు ' అంది వసుధ
'సరే అత్తయ్యా.. నేనాఫీసుకెళ్తాను' అని ఆఫీసుకెళ్ళిన రాఘవ 'feeling stressed.. Waiting for weekend' అని స్టేటస్ పెడితే కొలీగ్స్ అందరూ సూపర్ లైక్ అని రిప్లై పెట్టేరు. లంచి టైములో బాక్సు ఓపెన్ చేసి 'eating delicious lunch prepared by my most loving wife vasudha' అని బాక్సులో ఉన్న మునుపటి రాత్రొండిన ఉప్మా పెడితే 'how sweet of you' అని వసుధ రిప్లై పెట్టింది. ఇది చూసిన బంధుమిత్రులందరూ 'cutest couple ever' అని కామెంట్లెట్టి లైకులెట్టేరు.
సాయంత్రం నాలుగవుతూండగా వసుధ వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది, ఆర్యన్ కి టర్మ్ ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్ట్లలో ఏ గ్రేడ్ వచ్చిందని. మెసేజ్ తోపాటు రిపోర్టు కార్డు కూడా ఫొటో తీసి పంపితే, రాఘవ వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసేడు 'Excellent performance raa Aryan.. Proud to have a son like you.. Friends and family.. Need your blessings and good wishes for Aryan' అని రిపోర్టు కార్డుతో సహా పోస్టు చేస్తే, యధావిధిగా లైకులూ, 'intelligent kid like father' అని కొలీగ్సూ, రాఘవ కింద పనిచేసే ఎంప్లాయిసూ కామెంట్స్ రాసేరు.
రాఘవ వాళ్ళ మేనేజరు మూర్తి ఫోన్ చేసి ఓసారి తన కేబిన్ కి రమ్మని పిలిచి 'నీకీ మధ్య పని కన్నా ఫేస్బుక్ ఎక్కువైపోయింది.. అసలే రిసెషన్ టైము.. ఎక్కువ సేపు ఫేస్బుక్ లోనే గడిపస్తున్నావు నువ్వు.. మా ఆవిడ నిన్ను ఫేస్బుక్ లో ఫాలో అవుతూంది.. నువ్వేసే వేషాలు నాకన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి.. అన్నట్టు మీ అబ్బాయికి ఫస్ట్ టర్మ్ లో ఏ గ్రేడ్ వచ్చిందని స్టేటస్ పెడితే నూటేభై లైకులొచ్చాయట కదా.. క్రితం ఏడు మావాడికి యూకేజీ లో ఏగ్రేడ్ వస్తే నూటపాతిక లైకులే వచ్చాయి.. మా ఆవిడ ఫోన్లో అరుస్తోంది.. ముందా సంగతి చూడు' అని చెప్పాడు. రాఘవ పరిగెత్తుకునెళ్ళి కొలీగ్సందరినీ బతిమాలి అన్ లైక్ కొట్టించి, మూర్తి దగ్గిరికెళ్ళి 'సర్.. మేడమ్ ని ఇప్పుడు చూడమని చెప్పండి.. జస్ట్ 64 లైక్స్ మటుకే ఉన్నాయి' అంటే, 'గుడ్.. కీపిటప్..ఫేస్ బుక్ లో నీ లిమిట్ లో నువ్వుండు...' అని పంపేసేడు మూర్తి.
రాత్రి ఇంటికొచ్చిన రాఘవ ఆర్యన్ చేత కేక్ కట్చేయించి ' celebrating Aryan' s success ' అని స్టేటస్ పెడుతూంటే కరెంటు పోయింది.
ఇప్పుడు ఈ చీకట్లో వంట ఎలా అని వసుధ కంగారుపడుతూంటే' కంగారెందుకమ్మా.. కొవ్వొత్తి వెలిగించు.. ఏదో ఒకటి చేసేద్దాం ' అన్నారు సత్తులత్తయ్య
' ఈయన ఈవెనింగ్ సెలబ్రేట్ చేసుకుందాం అన్నారని కూరలేవీ కొనలేదు పిన్నీ.. ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్తారనుకున్నా' అంది వసుధ
'డోంట్ వర్రీ.. మన ముగ్గురికీ డామినోస్ నుంచి పిజ్జా, అత్తయ్య కోసం నవయుగ నుంచి మసాలా దోసె online లో ఆర్డర్ చేసేను' అన్నాడు రాఘవ
కొవ్వొత్తి వెలుగు లో పిజ్జా తింటూ 'eating Domino's pizza in candle light with my sweet wife and Cute son' అని ఫేస్బుక్ లో ఫొటో పెడితే 'how romantic', 'ultimate romantic family ',' you should have ordered from pizza hut, they have one plus one offer.. ' ఇత్యాది కామెంట్లొచ్చిపడ్డాయి.
ఆ పోయిన కరెంటు ఎంతకీ రాలేదు, పైగా వాన మొదలైంది. మెరుపుల్నీ, వర్షాన్నీ ఫొటోలు తీసి ఫేస్బుక్ లో పెడుతుంటే ఫోన్ బ్యాటరీ అయిపోయింది. సమయానికి పవర్ బ్యాంకు కూడా ఛార్జింగ్ లేకపోవడంతో పిచ్చెక్కిపోయేడు రాఘవ. కాలుకాలిన పిల్లిలా పడుక్కోకుండా ఇల్లంతా తిరుగుతూంటే 'ఈ చీకటి రాత్రి దెయ్యం లా ఇల్లంతా తిరుగుతావేమిరా?' అని సత్తులుగారడిగితే గారు తిట్టేసరికి గొణుక్కుంటూ పడుక్కోడానికి ప్రయత్నించేడు రాఘవ.
నిద్ర పట్టక మధ్య రాత్రి బయటికొచ్చి చూసేసరికి భోరున కురుస్తున్న వాన అస్సలు తగ్గేలా కనిపించడంలేదు. బయట కారిడార్ లో అపార్ట్మెంట్ లోని మిగతా కుటుంబాలవారందరూ ఆ చీకట్లోనే సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకునే కార్యక్రమంలో బిజీగా కనిపించేరు. 'ఛస్.. అనవసరంగా కేర్లెస్ గా ఉండబట్టి గానీ తన పవర్ బ్యాంకు లో ఛార్జి ఉండుంటేనా తన ఐఫోన్లో ఈపాటికి బోలెడు ఫొటోలు తీసేద్దును' అనుకుంటూ అసహనంగా ఇంట్లోకెళ్తూంటే, పక్కింటి జోషి అడిగాడు 'పవర్ బ్యాంక్ చాహియే?' అని.. 'నహీ.. మేరే పాస్ తీన్ పవర్ బ్యాంక్ హై' అని తలుపేసుకున్నాడు.
మర్నాడు ఉదయం కూడా వర్షం తగ్గలేదు, చెరువునాక్రమించి కట్టిన అపార్ట్మెంట్ కావడంతో సెల్లార్లో నీళ్ళొచ్చి కార్లన్నీ ములిగిపోయేయి. అంత వర్షం లోనూ పాలపేకెట్లట్టుకొచ్చిన రజాక్ చెప్పాడు 'ఇవ్వాళ మోకాళ్ల దాకా నీళ్లున్నాయి కాబట్టి తీసుకురాగలిగాను.. ఇంకొక మూడు రోజులు ఉంటుందంట ఈ వర్షం.. రేపొస్తానో లేదో తెలీదు`
అప్పటికే కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతున్న రాఘవ, ఈ మాటలు విని నీరుగారిపోయేడు.' అదేమిట్రా.. మీ ఆఫీసాళ్ళకి అర్థం అవుతుందిలే.. ఇంత వర్షాల్లో ఆఫీసుకెళ్ళకపోతే మురిగిపోయేదేంలేదు' అని సత్తులుగారంటే 'అయ్యో పిన్నీ.. ఆయన బాధ ఆఫీసుగురించి కాదు.. ఆ ఫోనట్టుకుని బాత్రూములో వాట్సాప్, ఫేస్బుక్ చూస్తూంటేనే ఆయన కడుపు ఖాళీ అవుతుంది' అని వసుధ చెప్పింది.
'పోన్లే నాయనా.. అలా ఇల్లంతా తిరుగుతూండు.. ఎప్పటికో అప్పుడు ఆ కడుపు ఖాళీ అవుతుంది' హాస్యమాడేరు సత్తులుగారు.
ఇంట్లో కూరలేవీ లేకపోవడంతో సత్తులుగారు ఆ రోజు ఉప్పుడు పిండి చేసిపెట్టేరు. ఆవురావురుమంటూ తింటూ రాఘవ అన్నాడు 'ఇవ్వాళ ఎందుకో చాలా సంతోషంగా తింటున్నాను.. మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంది'
'ఎందుకుండదు నాయనా? ఆ వెధవ ఫోనొకటి పక్కన లేదు కదా.. అందుకే ఈ ప్రశాంతత' అని సత్తులుగారంటే, మొహం మాడ్చుకున్నాడు రాఘవ.
ఆ సాయంత్రం కారిడార్లో అందరూ వర్షం చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించేరు. ఎప్పుడూ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉండడమే తప్ప ఎప్పుడూ ఎదురుపడినా మాటాడుకోనివారందరూ పరిచయం చేసుకుని మరీ మాటాడేసుకుంటున్నారు.
రాఘవకి ఇదంతా కొత్తగా అనిపించినా సంతోషమేసింది,ఇంతమంది ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాటాడేసుకుంటూంటే. జోషి గారు వాళ్ళింట్లో ఆ ఫ్లోరులో ఉన్నాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేరు. అపార్ట్మెంట్ లోని ఈతొచ్చిన మగాళ్ళందరూ ఆ పీకల్లోతు నీళ్ళలోకి దిగి, కింద నుంచి ఆ వర్షం నీటినే ఇంటవసరాలకోసం బక్కెట్లతో పైకి పంపేరు.
ఆ రాత్రి సత్తులుగారొండిన పిండి పులిహోర తింటూ రాఘవ 'ఇంతకాలం కళ్ళెదురుగానున్న మనుషుల్ని పట్టించుకోకుండా ఎంతసేపూ ఫేస్బుక్ లో నున్న ఫ్రెండ్స్ నన్ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూంటే చాలనుకుని చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని పట్టించుకోలేదు.. ఇప్పటికి మనుషుల విలువ తెలిసింది' అని బాధపడ్డాడు.
'ఇవాళ నువ్వు ఫోన్ లేకుండా టాయిలెట్ కి వెళ్ళావు నాన్నా'అని ఆర్యన్ అంటే, రాఘవ సిగ్గుపడ్డాడు.
ఆ తెల్లవారుజామున వర్షం నిమ్మళించి, కరెంటొచ్చింది. మర్నాడుదయన్నే రాఘవ యధావిధిగా ఫోనట్టుకుని టాయిలెట్లోకి దూరి ఫేస్బుక్ లో తన వర్షం వల్ల పడ్డ ఇబ్బందులు అప్డేట్ చెయ్యడం మొదలెట్టాడు!