పూర్వం యజ్ఞవల్క్య మహర్షి మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప మహర్షి అని ఆ రోజుల్లో ఎంతో పేరుండేది. నిత్యం యజ్ఞయాగాలను చేస్తూ జీవితం గడుపుతుండేవాడు. రాజులు, రారాజులు, తోటి మునులు, ఋషులు ఆయన ఔన్నత్యాన్ని నిరంతరం కీర్తిస్తూ ఉండే వారు. ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఆశ్రమంలోకి ఒక ముంగిస పరుగెత్తుకురావటం ఆయన కంటపడింది. వెంటనే పక్కనున్న వారితో ఆ ముంగిస ఆశ్రమం లోపల ఉంచిన పాలు తాగటానికి వస్తున్నట్లుందని, దాన్ని వెళ్ళగొట్టమని చెప్పాడు. ఆ చెప్పటంలో ముంగిసను పరిపరివిధాల పరుషపదజాలాన్ని ఉపయోగించి నిందించాడు ఆ మహర్షి. వచ్చిన ముంగిస సాధరాణమైనదికాదు. దానికి అత్యంత జ్ఞానశక్తి ఉంది. దాంతో ఆ ముగింస మానవ భాషలో యజ్ఞవల్క్య మహర్షిని చూసి మాట్లాడటం ప్రారంభించింది. ఓ! యజ్ఞవల్క్యుడా పరుష పదజాలంతో నన్ను నీవు నిందించటం మహా ఘోరమైన విషయం. కఠినమైన పదాలలో ఎదుటి వారిని బాధిస్తే ప్రాప్తించే నరకాలు ఎంత బాధాకరంగా ఉంటాయో నీకు తెలియదనుకొంటాను. నేనేగొప్ప అని ఎదుటి వారు అధములని నోటికి వచ్చినట్లుగా నిందా పూర్వకంగా మాట్లాడవచ్చని ఏ శాస్త్రంలోనూ మరేస్మృతిలోనూ రాసిలేదు. కఠిన వాక్కు ఎదుటి వ్యక్తి మనుస్సును వాడి అయిన ములుకులాగా బాధిస్తుంది. దానికి ఫలితం ఆ పలుకులు పలికిన వ్యక్తి మరణించిన తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. యమభటులు అలా మాట్లాడిన వాడి గొంతు మీద కాళ్లతో తొక్కి హింసిస్తారు. వాడి చెవులలో లోహపు ములుకులు దించుతారు. వదరుబోతు తనంతో అడ్డదిడ్డంగా మాట్లాడిన వాడిని వజ్రసమానం, కాలకూట విషపూరితం అయిన ములుకులతో యమభటులు బాధిస్తారు. అసలు కఠినమైన మాటలు మహాబాధాకరాలు. శరీరంలో గుచ్చుకున్న బాణాలనైతే పెకలించవచ్చేమో కానీ మనసులో గుచ్చుకొన్న పరుష వాక్యాలనే బాణాలను పెకలించటం కానీ ఆ బాణపుదెబ్బ తిన్న వ్యక్తికి సంతోషం కలుగచేయటం కానీ ఎవరి వల్ల సాధ్యపడదు. ఓ! యజ్ఞవల్క్యుడా నీవు నన్ను అనేక విధాల మాటలతో బాధించావు. అయితే అందరూ అంటూ ఉన్నారు కదా నేనంటేనే అంత పాపం వస్తుందా అని నీవు తిరిగి అనవచ్చు. ఒకడెవడో పాపం చేసాడని ప్రతివాడూ అలాగే చేస్తే అందరూ పాపాత్ములే అవుతారు. కనుక పాపాత్ముల మార్గంలో నడచుకోవటం ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు. నీవు చేసిన పాపానికి ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను. మరుసటి జన్మలో జ్ఞానహీనుడుగా జన్మించు అని శపించి వెళ్లిపోయింది. ముంగిస శాపకారణంగా యజ్ఞవల్క్యుడు జ్ఞాన హీనుడై ఓ ఇంట జన్మించాడు. అయితే నిరంతరం భగవద్భక్తి మార్గంలో నడుచుకోవటం వల్ల గత జన్మలో తానెవరన్నది, ఏం చేసింది జ్ఞాపకం ఉంది. ముంగిస శాపం వల్ల ఏ శాస్త్రాలు పట్టుపట్టలేదు. కానీ ఒక్క దైవభక్తి ప్రభావం చేత ఎంతో సౌమ్యంగా ఉంటూ చివరకు మహీసాగర సంగమం వద్ద తీర్థవిధులను ఆచరించాడు. అప్పటికి ఎలాగోలాగా పాపవిముక్తి కలిగింది. యజ్ఞవల్క్యుడు అంటే సామాన్యుడేమీ కాదు. ఎంతో గొప్ప మహర్షి. అలాంటి ఆయనకే పరుషపదజాలంతో ఎదుటి జీవిని నిందించినందుకు శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇక సాధారణ జీవితం గడిపేవారు ముంగిస చెప్పిన నరక బాధలను వాక్పారుష్యం వల్ల పొందుతారని కనుక ఎవరినీ కష్టపెట్టేలా ఎగతాళిగా, నిందాపూర్వకంగా పిలవటం, మాట్లాడటం మంచివి కాదు .