ధాన్యం బకాయిలు కోసం ఏలూరులో జోలె పట్టిన అన్నదాతలు..
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం- కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా..
ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి..
రైతు సంఘాల నాయకులు డిమాండ్..
ఏలూరు జూన్ 23:
రైతులకు, కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు గురువారం ధర్నా నిర్వహించారు. వరి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జోలెపట్టి అన్నదాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సార్వా సాగు చేయాలి.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ధర్మం చెయ్యండి అంటూ అన్నదాతలు ఆర్తనాదాలు చేశారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కె.అప్పారావు మాట్లాడారు. రైతులు, కౌలు రైతులు రబీ ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. రబీ అప్పులు తీర్చకుండా ఖరీఫ్ సాగుకు అప్పులు దొరకక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఖరీఫ్ అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలుకు, ట్రాక్టర్ల కిరాయిలకు చేతిలో పెట్టుబడులు లేకుండా సార్వా సాగు ఎట్లా చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు రబీ అప్పులకు వడ్డీలు పెరిగి పోతున్నాయని చెప్పారు. రైతులు ధాన్యం అమ్మిన 21 రోజులలో సొమ్ములు చెల్లిస్తామన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదన్నారు. ఇదేనా రైతుకు ప్రభుత్వ భరోసా అని ప్రశ్నించారు. జిల్లాలోని రైతాంగానికి 15వేల మందికి రూ. 450 కోట్లకు పైగా ధాన్యం సొమ్ములు చెల్లించాల్సిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వరి రైతులకు ఉరి వేస్తోందని విమర్శించారు. ధాన్యం సొమ్ములు చెల్లింపు ఆలస్యం వలన వడ్డీలు పెరిగి పోయి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రబీ దిగుబడి తగ్గి నష్టపోయారన్నారు. ధాన్యం సొమ్ములు చెల్లింపుల ఆలస్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి వడ్డీతో సహా రైతాంగానికి ధాన్యం సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మంజు భార్గవి కి రైతు సంఘాల నాయకులకు వినతిపత్రం అందజేశారు. రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సోమయ్య సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం' ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, సున్నా వెంకట్రావు,దుడే కేశవ,ఎస్. భూలక్ష్మి, బి లక్ష్మణ రావు, గురజాల కృష్ణ బాలాజీ,పొన్నాడ పారినాయుడు, కాటూరి కనకరాజు, ఎస్.సాయి తదితరులు పాల్గొన్నారు.