Home » » మహిళా జయహో

మహిళా జయహో

అదో రైల్వే క్యాంటీన్‌. రోజూ వెయ్యిమందిదాకా తింటారక్కడ. వాళ్లు తిన్నపాత్రల్ని కడగడం ఆ అమ్మాయి పని. చుట్టూ కొండలా చేరిన అంట్ల మధ్య.. ముడేసిన జుట్టు వూడిపడుతుంటే సర్దుకుంటూ.. పాత్రల్ని పరపరా తోమేసే ఆ చేతులు ఒకప్పుడు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాయనే విషయం ఎవరికీ తెలియదు! ఆ అమ్మాయితో చదువుకున్నవాళ్లకి తెలుసుకానీ.. వాళ్లు తనని చూడగానే తలతిప్పుకుని వెళ్లేవారు!! ఇక్కడే ఓ కీలక నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఒక్క ఐక్యరాజ్యసమితేకాదు.. దేశవిదేశాల్లోని సేవాసంస్థలు ఆమె వైపు తలతిప్పి చూసేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం సాధించింది?
ఆ అమ్మాయి పేరు ముత్తమిళ్‌. చెన్నైలోని ఓ రైల్వే కాలనీలో పుట్టిపెరిగింది. నాన్న అక్కడే వెల్డర్‌. అమ్మ గృహిణి. ఇంట్లో ఓ అక్కా, అన్న తర్వాత ఈ అమ్మాయి. ఈమెకో తమ్ముడు. పెద్ద కుటుంబమే. రైల్వే ఉద్యోగం కాబట్టి.. ఏదో నెట్టుకొస్తారులే అనుకోవడానికి లేదు. నాన్న తాగుడికి బానిసైపోయాడు. ఇంట్లో గడవడానికి కష్టమయ్యేది. ఆయన రోజంతా ఎంత మత్తులో ఉన్నా ఓ మంచి పనిచేశాడు. ముత్తమిళ్‌ని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో చేర్చాడు. అక్కడి క్రమశిక్షణా, విషయావగాహనా, పఠనం, పర్యటనలే ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. శ్రమించే తత్వాన్నీ, సాయపడే గుణాన్నీ పెంచాయి. 2005లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడే ఉత్తమ స్కౌట్‌ బాలికగా ఎంపికై రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా అవార్డూ అందుకుంది. పదో తరగతిలో మంచి మార్కులు. ఇంటరూ పూర్తయింది. కాలేజీకి వెళ్లి డిగ్రీ చదవాలని కలలు కనసాగింది ముత్తమిళ్‌. అప్పుడు పిలిచాడు నాన్న.. ‘రైల్వేలో గ్రేడ్‌ డి ఉద్యోగాలు పడ్డాయటమ్మా. పదో తరగతిలో మంచి మార్కులూ, రాష్ట్రపతి అవార్డు ఉన్నాయి కదా.. నీకు వస్తుంది!’ అన్నారాయన. ససేమిరా అంది. ‘అక్కయ్య పెళ్లికైన అప్పులు ఇంకా తీరలేదు. నేనూ వచ్చే ఏడాది రిటైర్‌ అవుతా. ఇక అప్పులెవరు తీర్చాలి? నా మాట విను..’ అన్నాడాయన. ఆ అమ్మాయి రైల్వే పోటీ పరీక్షలు రాసింది. రాదనే ధీమాతోనే కాలేజీలో చేరింది. మూడునెలల్లోనే రైల్వే బోర్డు నుంచి పిలుపొచ్చింది.. ఉద్యోగం ఇస్తున్నట్టు! ఎలాంటి ఉద్యోగం అది? క్యాంటీన్‌లో వేలాది పాత్రలు తోమాలి. తోటమాలిగానూ చేయాలి. నెలతిరిగేసరికి జీతం. అడపాదడపా బోనస్‌లూ.. ఇంట్లోవాళ్లందరికీ ఆనందమే. ఆమెకి తప్ప!
‘గుండె ముక్కలైంది’ ‘ఒకప్పుడు నాతో చదువుకున్నవాళ్లందరూ సాఫ్ట్‌వేర్‌లో చేరి వేలాదిరూపాయల జీతం తీస్తుండేవారు. అంట్లుతోముతూనో, తోటమాలిగానో ఉండే నన్ను చూసి తలతిప్పుకుని వెళ్లేవారు! ఇది నన్ను మానసికంగా కుంగదీసింది. నేను చేసే పనిలోని కాలుష్యం సైనసైటస్‌సమస్యని తెచ్చిపెట్టింది. ఉద్యోగం మానేద్దామా అంటే ఇల్లు గడవదు. ఇన్నింటి నడుమ నాకు ఒయాసిస్సులా అనిపించింది చదువే. అమ్మానాన్నకి చెప్పకుండా బీఎస్సీ సైకాలజీ దూరవిద్యలో చేరాను. ప్రఖ్యాత లయోలా కాలేజీలో ఈవెనింగ్‌ కోర్సుకింద ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లమో చదివాను. కానీ ఆ సైకాలజీ డిగ్రీ ఇవ్వని ఓ తెగింపుని.. ఓ కొత్త చదువుల అవకాశం ఇచ్చింది. ముంబయి టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌(టిస్‌)లో చదివే అవకాశం అది. సామాజిక సంబంధాలపై చదవడానికి ఇంత పెద్ద సంస్థ ఉందా? అని ఆశ్చర్యపోయాను. ఇంట్లో తెలియకుండా రహస్యంగా చదివి పోటీ పరీక్షలు రాశాను. ‘స్కౌట్స్‌ శిబిర’మని అబద్ధం చెప్పి ఇంటర్వ్యూకి వెళ్లొచ్చాను. స్కాలర్షిప్పుతో సీటు సాధించాను. ఆ రోజైతే ఓ వైపు ఆనందం. మరోవైపు భయం. ముంబయికి వెళ్లి చదవాలంటే రైల్వే ఉద్యోగాన్ని వదిలేయాల్సిందే. ఆ మాటే అంటే ఇంట్లోవాళ్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘ఆరువేల జీతం వదులుకుని వెళతావా? పిచ్చా నీకూ..’ అన్నారు. అంతేకాదు, ‘ఇక ఎప్పుడూ మా మొహం చూడొద్దు. ఈ ఇంటి గడప తొక్కొద్దు..’ అనేశారు. పుస్తకాలన్నీ నా మొహాన విసిరికొట్టారు!! అంతకన్నా మా చుట్టుపక్కలవాళ్ల మాటలు గుండెని ముక్కలు చేశాయి. ‘ఎవడితోనో లేచిపోవాలనుకుంది. దానికి చదువుల వంక చెబుతోంది..!’ అన్నారు!- గుర్తుచేసుకుంటుంది ముత్తమిళ్‌.
తొలి విద్యార్థి నాయిక! టిస్‌.. దేశం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థుల సంగమస్థలి. ఆంగ్లం నిత్యం నాలుకపై నాట్యం చేస్తుంటుంది అందరికీ. చెన్నైలో ఇంచుమించు మురికివాడలాంటి రైల్వే కాలనీ నుంచి వచ్చిన ముత్తమిళ్‌ ఆ వాతావరణం చూసి బెదిరిపోయింది. ఆంగ్లం మాట్లాడలేక కుంగిపోయి.. రోజూ కన్నీళ్లే పెట్టుకుంది. కానీ మూడునెలల్లో ఆంగ్లమేకాదు.. అక్కడి వాతావరణాన్నీ తన గుప్పిట్లోకి తీసుకుంది. ముత్తమిళ్‌లోని చురుకుదనం, దీక్ష, కలుపుగోలుతనం చూసి విద్యార్థి నాయికగా ఉండమన్నారు సహ విద్యార్థులు! దానికీ ఎంతో వ్యతిరేకత.. ‘ఓ అమ్మాయి నాయిక కావడం ఏమిటీ?’ అని. అయినా డెభ్భై అయిదేళ్ల టిస్‌ చరిత్రలో తొలి విద్యార్థి నాయికగా ఎంపికైంది! రెండేళ్లు అలా గిర్రున తిరిగిపోయాయి. మిగిలింది స్నాతకోత్సవం. అయిష్టంగానే వచ్చారు అమ్మానాన్నా. కానీ అన్ని సబ్జెక్టుల్లోనూ ర్యాంకర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆమెని చూసి.. వాళ్లకి కన్నీళ్లాగలేదు. ఏడుస్తూ ఆమెని చుట్టేసుకున్నారు.
ఆస్ట్రేలియాలో.. ఈలోపు ఆస్ట్రేలియాకి చెందిన వజ్రపు గనుల తవ్వకం సంస్థ రియో టింటోలో ఉద్యోగం వచ్చింది! మన లెక్కల ప్రకారం నెలకి ఐదులక్షల జీతం. ఆ సంస్థలో పనిచేసే ఆదివాసీల సంక్షేమం చూడటం ఆమె పని!‘వాళ్ల కోసం పనిచేస్తున్నప్పుడు నాకు మన మురికివాడల పిల్లలు పదేపదే గుర్తొచ్చేవారు! చదువు నాకిచ్చిన చైతన్యం వాళ్లతో పంచుకోవాలనుకున్నా. ఉద్యోగానికి రాజీనామా చేశా! మళ్లీ అవే మాటలు. ‘ఇంకో ఐదేళ్లు చేస్తే కోట్లు కూడబెట్టొచ్చు. నీకేమైనా పిచ్చిపట్టిందా..’ అని. నా పిచ్చి నాది! అందుకే చెన్నై వచ్చి ‘నీలం’ ఎన్జీఓని ప్రారంభించాను..’ అంటుంది ముత్తమిళ్‌. ఆ సంస్థ ద్వారా చెన్నై, చుట్టుపక్కలున్న మూడు జిల్లాలకి చెందిన మురికివాడలని దత్తతతీసుకుని.. ఐదొందలమంది పిల్లలకి కళల ద్వారా విద్యానైపుణ్యాలు నేర్పిస్తోంది. ఈ రెండేళ్లలో ఈ ప్రయత్నం వల్ల పిల్లలు మధ్యలోనే బడి మానేయడం 90 శాతం తగ్గిపోయిందంటోంది ముత్తమిళ్‌. ఆమె గురించి రజనీకాంత్‌ ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్‌ ఎక్కడో పత్రికల్లో చదివి ఆమె సంస్థలో ట్రస్టీగా చేరారు. ఐరాస గత ఏడాది ‘అభివృద్ధిచెందుతున్న దేశాలు - రాజకీయాల్లో మహిళలు’ అంశంపై నిర్వహించిన సదస్సుకి వక్తగా ముత్తమిళ్‌ని పిలిచింది!
ఆమెకో పాప..! ‘టిస్‌’లో చదవాలనుకున్న నిర్ణయం తర్వాత ఆమె జీవితంలో పెద్ద మలుపు ఇదే. ఆమె ఏమంటారంటే.. ‘ఆ రోజు నేనో మురికివాడ ప్రాంతానికి వెళితే.. ఓ బక్కచిక్కిన ముసలాయన ఇద్దరు మనవరాళ్లని తీసుకొచ్చాడు. ఓ పాపకి ఐదేళ్లు. మరోబిడ్డకి ఒకటిన్నర ఏడాది. పెద్దపాపని దగ్గరకి రమ్మని ‘నాతో వచ్చేస్తావా.. మా ఇంటికి!’ అన్నా సరదాకి. సరేనని నవ్వుతూ నా చేయి పట్టుకుంది. అప్పుడు అడిగాను ఆ పెద్దాయన్ని విషయం ఏమిటని! ‘అమ్మా, వీళ్లనాన్న మొన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పిచ్చిదైపోయింది. ముసలివాళ్లం సాకలేకపోతున్నాం..’ అన్నాడు. మా నీలం ద్వారా వాళ్లకి సాయం చేయాలని అనుకున్నా. అనుకుని ఆ పాపవైపు చూస్తే.. నా చేయి అలాగే పట్టుకుని ఉంది! అంటే ‘నేను నాతో వస్తావా?’ అని నేను వూరికే అడిగిన మాటని ఆ చిన్నపాప నమ్మేసిందన్నమాట. తన నమ్మకాన్ని ఎలా వమ్ముచేయను? అలా మధుశ్రీని నాతోపాటూ తెచ్చి.. దత్తత తీసుకున్నాను. ఇంట్లో, చుట్టుపక్కలా మళ్లీ అదే గోల. ‘నీకెలా పెళ్లవుతుందే..!’ అని. ఎప్పట్లాగే పట్టించుకోలేదు. రెండేళ్లయ్యాయి. ఇప్పుడు మధుశ్రీ ఐదో తరగతి చదువుతోంది. ఆమె చెల్లెల్ని నా స్నేహితులైన వైద్య దంపతులు పెంచుతున్నారు. ఇప్పడు వ్యక్తిగతంగా మధుకి నేనూ, నాకు మధు అంతే! మరి పెళ్లంటారా? ఇప్పటికైతే మధు నాపై ఉంచిన నమ్మకానికంటే పెళ్లేమీ ముఖ్యం కాదు అనిపిస్తోంది మరి!