స్మార్ట్ సిటీ ఎం.డి, సి.ఈ.ఓగా నాగ నరసింహారావు బాధ్యతలు
కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సి.ఈ.ఓగా నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. స్మార్ట్ సిటీ ఎం.డి, సి.ఈ.ఓ కొనసాగిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ కమిషనర్ గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. స్మార్ట్ సిటీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, స్మార్ట్ సిటీ అధికారులు నాగ నరసింహారావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను సి.ఈ.వో సమీక్షించి, రాగిరెడ్డి కళాక్షేత్రం, సైన్స్ సెంటర్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి పారదర్శకంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.