Home » » విలసను చూసి మోసపోకండి.... పులసను తిట్టుకోకండి ...

విలసను చూసి మోసపోకండి.... పులసను తిట్టుకోకండి ...

 విలసను చూసి మోసపోకండి 

పులసను తిట్టుకోకండి 



విలసలు,పులసలు రూపురేఖల్లో ఒకేలా ఉంటాయి.కాని రుచిలో మాత్రం పొంతన ఉండదు. గోదావరికి ఎర్రనీరు చేరగానే పులసలు అందుబాటులోకి వస్తాయి. కాని ఈ ఏడాది ముందుగానే వరద నీరు వచ్చినప్పటికీ ఇవి మాత్రం జాలర్ల వలకు పులస ప్రియుల నోటికి చిక్కడం లేదు. అయితే అదే ఆకారంలో ఉండే విలసలు మాత్రం గోదావరి తీరం వెంబడి విరివిగా అమ్మకాలు సాగిస్తున్నారు. చాలామందికి ఈ విషయం తెలియక ఇవే పులసలని కొనుగోలు చేసుకుని తీసుకెళ్లుతున్నారు.తీరా తిన్నాకా పులస రుచి లేదని నిందిస్తున్నారు. 

      వాస్తవానికి విలసే పులసగా మారుతుంది. సముద్రపు ఉప్పునీటిలో ఉండే ఈ విలసలకు అంత రుచి ఉండదు.అయితే అవి గోదావరి నదులోకి చొరబడి ఎర్ర నీరును తాగుతూ పులసగా మారుతాయి. అమోఘమైన రుచిని సొంతం చేసుకుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పులసల జాడ గణనీయంగా తగ్గింది. కేజీ పులస చేప దొరకడం గగనమైపోతుంది. ఎక్కడైనా దొరికితే వేళల్లో ధర పలుకుతుంది. ఈ ఏడాది ఇప్పుటి వరకు ధవళేశ్వరం ప్రాంతంలో పులస దొరకలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక, ధవలేశ్వరం,అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ,రావులపాలెం, కపిలేశ్వరపురం, కోటిపల్లి, యానం తదితర ప్రాంతాల్లో ఈ పులస విక్రయాలు జరుగుతుంటాయి.యానం నుంచి గోదావరి నదిలోకి చొరబడే ఈ విలసలు ఏటికి ఎదురీదుతూ ధవళేశ్వరం బ్యారేజి వరకూ వస్తాయి.ఇవి ఎంతదూరం ప్రయాణిస్తే అంతరుచి పెరుగుతుంది. అందుకునే పొట్టిలంక, ధవలేశ్వరం  ప్రాంతాలలో దొరికే పులస ధర మరింత అధికంగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి పులస ధర పలుకుతుండటం ఈ చేప ప్రత్యేకత.

 అయితే ఒరిస్సా ప్రాంతాల్లో ప్రస్తుత సీజన్లో అధికంగా దొరికే విలసలను టన్నుల చొప్పున కొనుగోలు చేసి ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ విషయం తెలియని వారు పులసనుకుని విలసను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. వండుకుని తిన్నాక రుసి లేదని పులసను తిట్టుకోసుకోవడం పరిపాటి అవుతుంది. కాని విలసకు పులసకు తేడా చెప్పడం కష్టమవుతుంది. గోదావరి ప్రాంత వాసులు తప్ప మిగిలినవారు గుర్తించలేరు. అందుకునే ఈ పులసలను తెలిసిన వారి వద్ద కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కడియం మండలం పొట్టిలంకలో ఇదే జరుగుతుంది. పొట్టిలంకలో పులసకు రుచి ఎక్కువని దూరప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి వస్తారు. కోటిపల్లి ప్రాంతం నుంచి జాలర్లు పొట్టిలంక గోదావరి ఒడ్డున తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని పులసల వేట చేపడతారు. ఈ ఏడాది వరదనీరు ముచ్చెత్తడంతో ఆ ప్రాంతంలో వేటకు అనుకూలంగా లేదని జాలర్లు ఇంకా రాలేదు.కాని విలసల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విలసలు కూడా కేజీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పలుకుతున్నాయి.  ప్రస్తుతం పులస దొరకడం లేదు కానీ దొరికితే కేజీ పదివేల రూపాయలు పైపడే పలుకుతుంది అనడంలో సందేహం లేదు.అందుకునే గత కొన్నేళ్లుగా సామంతులకే ఈ పులస రుచి చూడటం సాధ్యమవుతుంది.కొందరు సామాన్యులు విలసలనే పులసలగా బావించి తృప్తి చెందుతున్నారు.