మరో చరిత్ర సృష్టించిన భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ లో చాంపియన్ గా నిలిచిన నీరజ్ ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డు
ఫైనల్లో 88.44 మీటర్లతో స్వర్ణం నెగ్గిన చోప్రా
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ లో చాంపియన్ గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్ర కెక్కాడు. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో చోప్రా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఆరుగురు మేటి జావెలిన్ త్రోయర్లు పోటీ పడ్డ తుది పోరులో నీరజ్ తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి స్వర్ణం సాధించడం విశేషం.
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ కు దూరంగా ఉన్న నీరజ్.. నెలన్నర విరామం తర్వాత జులై చివర్లో లాసానె డైమండ్ లీగ్ లో విజేతగా నిలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్ లో ఫైనల్స్ ఆడినా... వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు.
అథ్లెటిక్స్ లో ప్రపంచ చాంపియన్ షిప్స్, ఒలింపిక్స్ తర్వాత డైమండ్ లీగ్ ను ఎంతో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణిస్తారు. ఇందులో మొత్తం 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో 13 సిరీస్ ల్లో ప్రదర్శన ద్వారా అథ్లెట్లు.. ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్ ను డైమండ్ లీగ్ ఛాంపియన్ గా పిలుస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఇవన్నీ సాధించాడు