Home » » Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగిస్తే నేను రైఫిల్ తో బదులిచ్చా..

Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగిస్తే నేను రైఫిల్ తో బదులిచ్చా..

 

Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగిస్తే నేను రైఫిల్ తో బదులిచ్చా..

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీకి తన రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తనను విస్మరించిందని కొద్దిరోజుల క్రితం తీవ్ర విమర్శలు చేసిన గులాం నబీ ఆజాద్‌..మరోసారి ఆ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ తనపై క్షిపణులు ప్రయోగించిందని.. కానీ వాటిని తాను రైఫిల్‌తో అడ్డుకున్నానని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లోని భదెర్వాలో చేపట్టిన ఓ భారీ ర్యాలీలో ఆజాద్‌ ప్రసంగించారు. ''వారు (కాంగ్రెస్‌) నాపై మిస్సైళ్లు ప్రయోగించారు. కానీ నేను కేవలం 303 రైఫిల్‌తోనే వాటిని ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకున్నా. అదే ఒకవేళ నేను బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగిస్తే.. వారు మాయమైపోయేవారు'' అంటూ వ్యాఖ్యానించారు.
అయితే, దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీపై మాత్రం ఆజాద్‌ సానుకూలంగా స్పందించారు. 52ఏళ్లు ఆ పార్టీలో ఉన్న తాను రాజీవ్‌ గాంధీని సోదరుడిలా భావిస్తే, ఇందిరా గాంధీని తల్లిలా భావించానన్నారు. అందుకే వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కశ్మీరీ నేత ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో ఉన్న 52 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని ఆజాద్‌ కొద్దిరోజుల క్రితమే తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీంతో కశ్మీర్‌కు చెందిన మరికొందరు నేతలు కూడా ఆజాద్‌ బాటలోనే నడిచారు.కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం మొదటిసారి జమ్ములో భారీ ర్యాలీ చేపట్టి మాజీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటుకు రక్తం ధారపోస్తే.. ఆ పార్టీ ఇప్పుడు తమను విస్మరించిందన్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్న ఆజాద్‌.. జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, భూమి హక్కుల కోసం, స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ము కశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, పతాకాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు.